Jasprit Bumrah: జాత్యాహంకార వ్యాఖ్యల వివాదం.. బుమ్రాకు ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ క్షమాపణలు

I would like to apologise for any offence caused says Isa Guha on Bumrah

  • బుమ్రాపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన ఇసా గుహ
  • మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు క్షమాపణలు
  • బుమ్రాను పొగుడుతూ ‘ఎంవీపీ’ అని వ్యాఖ్యానించిన ఇసా
  • చింపాంజీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఎంవీపీ’ సినిమాలోని పాత్రతో పోలిక
  • సోషల్ మీడియాలో విమర్శలతో దిగొచ్చిన ఇంగ్లిష్ వ్యాఖ్యాత

బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇసా గుహ టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి జాత్యాహంకారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ ఆమె క్షమాపణలు చెప్పారు. ఆట మూడవ రోజు ప్రారంభానికి ముందు ‘ఫాక్స్ క్రికెట్’ ఛానల్‌ లైవ్ ప్రోగ్రామ్‌లో ఆమె సారీ చెప్పారు.

‘‘నిన్న(ఆదివారం) కామెంటరీలో నేను పలికిన ఒక పదాన్ని విభిన్న సందర్భాలకు అన్వయించవచ్చు. దీని కారణంగా తలెత్తిన తప్పుకి క్షమాపణలు చెబుతున్నాను. ఇతరుల పట్ల గౌరవం, సానుభూతి విషయంలో నన్ను నేను చాలా ఉన్నతంగా ఉంచుకుంటాను’’ అని ఆమె వెల్లడించారు.

కాగా, రెండవ రోజు ఆటలో 5 వికెట్లతో రాణించిన జస్ప్రీత్ బుమ్రాను ఇసా గుహ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే, తన వ్యాఖ్యానంలో బుమ్రాను ‘ఎంవీపీ’తో పోల్చారు. ఎంవీపీ (మోస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్) అనేది ఒక సినిమా పేరు. చింపాంజీ ఒక హాకీ ప్లేయర్‌గా రక్తికట్టించే కామెడీ-స్పోర్ట్స్ మూవీ ఇది. ఎంవీపీ పదాన్ని ఉపయోగించి బుమ్రాను ఒక చింపాంజీతో పోల్చారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారంటూ ఇసా గుహపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై రవిశాస్త్రి కూడా స్పందించారు. 

అయితే, తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రాను పొగిడే సందర్భంలోనే ఈ పదాన్ని తాను ఉపయోగించానని ఇసా గుహా స్పష్టం చేశారు. బుమ్రా బౌలింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడుతూ ఈ పదాన్ని ఉపయోగించానంటూ వివరణ ఇచ్చారు. భారత్ తరపున మాట్లాడుకోవాల్సిన ఏకైక ఆటగాడు బుమ్రా మాత్రమేనని చెప్పదలచుకున్నానని, మూడవ టెస్టులో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన భారత ఆటగాడు అతడేననే సందర్భంలో చెప్పానని తెలిపారు. తన వ్యాఖ్యలను పూర్తిగా గమనిస్తే భారత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిపోతాడంటూ ప్రశంసించానని ఇసా గుహ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News