NASA: నేడు భూమికి సమీపం నుంచి దూసుకుపోనున్న రెండు గ్రహశకలాలు

Two massive asteroids 2024 XY5 and 2024 XB6 are hurtling towards Earth on Monday

  • దూసుకొస్తున్న ‘2024 ఎక్స్‌వై5’, ‘2024 ఎక్స్‌బీ6’ ఆస్టరాయిడ్స్
  • భూమికి ఎలాంటి ముప్పు లేదన్న నాసా శాస్త్రవేత్తలు
  • 71 అడుగుల వెడల్పు ఉన్న‘2024 ఎక్స్‌వై 5 గ్రహశకలం

ఇవాళ (సోమవారం) రెండు భారీ గ్రహశకలాలు భూమికి సమీపం నుంచి ప్రయాణించనున్నాయి. ఒకదాని పేరు ‘2024 ఎక్స్‌వై5’ కాగా, రెండవది ‘2024 ఎక్స్‌బీ6’ అని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్ధారించింది. ఈ రెండు డిసెంబర్ 16న భూమి వైపు దూసుకురానున్నాయని తెలిపింది. అయితే, భూమికి ఎలాంటి ముప్పులేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహశకలాల ట్రాకింగ్, అప్రమత్తత విషయంలో అవగాహన పొందవచ్చని వివరించారు.

భూమి సమీపానికి రానున్న రెండు గ్రహశకలాల్లో ఒకటైన ‘2024 ఎక్స్‌వై5’ పరిమాణం 71 అడుగుల వెడల్పు ఉంది. గంటకు 10,805 మైళ్ల వేగంతో వెళ్లే ఈ గ్రహ శకలం, భూమికి దాదాపు 2,180,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. చంద్రుడి దూరం కంటే 16 రెట్లు ఎక్కువ దూరం నుంచి ఈ గ్రహశకలం వెళ్లనుంది. 

ఇక ‘2024 ఎక్స్‌వై’ కంటే ‘2024 ఎక్స్‌బీ6’ గ్రహశకలం కొంచెం చిన్నది. దీని వ్యాసం 56 అడుగులుగా ఉంది. గంటకు 14,780 మైళ్ల వేగంతో భూమికి దాదాపు 4,150,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుందని నాసా తెలిపింది. ఇలాంటి గ్రహశకలాలు సౌర వ్యవస్థ ఆరంభానికి సంబంధించినవని, ఇవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇలాంటి గ్రహశకలాలను అధ్యయనం చేస్తే భూమి మూలాలు, విశ్వం చరిత్రకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని నాసా శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, భూమికి సమీపంలో ఉన్న వస్తువులను పర్యవేక్షించడానికి అధునాతన వ్యవస్థలను నాసా ఉపయోగిస్తుంది.

  • Loading...

More Telugu News