Priyanka Gandhi: 'పాలస్తీనా' బ్యాగ్‌తో ప్రియాంకగాంధీ... బీజేపీ నేతల చురకలు
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి
- పార్లమెంట్ ఆవరణలో పాలస్తీనా అనుకూల బ్యాగ్‌తో ప్రియాంక
- వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తుంటారని బీజేపీ నేత విమర్శ
వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సోమవారం పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌తో లోక్ సభకు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ, శాంతి చిహ్నాలు ఆ బ్యాగ్‌పై ఉన్నాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రియాంక గాంధీ ఆ బ్యాగ్‌తో దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేశారు.
ప్రియాంక గాంధీ తీసుకెళ్లిన ప్రత్యేక బ్యాగ్... పాలస్తీనాకు ఆమె మద్దతు, సంఘీభావాన్ని చూపుతోందని, కరుణ, న్యాయం, మానవత్వం పట్ల నిబద్ధతకు ఇది చిహ్నం అని షామా పేర్కొన్నారు. తద్వారా జెనీవా ఒప్పందాన్ని ఎవరూ ఉల్లంఘించలేరని ఆమె స్పష్టం చేశారని రాసుకొచ్చారు.
ప్రియాంక గాంధీ ఆ బ్యాగ్‌తో కనిపించడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పుడు, వారు అలాంటి చర్యలను ఆశ్రయిస్తారని విమర్శించారు. గాంధీ కుటుంబం ఎప్పుడూ బుజ్జగింపుల సంచిని మోస్తుంటుందని బీజేపీ నేత సంబిత్ పాత్ర విమర్శించారు. ఎన్నికల్లో వారి ఓటమికి బుజ్జగింపుల సంచే కారణమని చురక అంటించారు.