Gold: నవంబర్లో పసిడి దిగుమతుల ఆల్ టైమ్ రికార్డ్
- గత నెలలో 14.8 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతులు
- ఏడాది ప్రాతిదికన 4.85 శాతం క్షీణించిన ఎగుమతులు
- 27 శాతం పెరిగిన భారత్ దిగుమతులు
భారత పసిడి దిగుమతులు నవంబర్ నెలలో ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేశాయి. గత నెలలో 14.8 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. అదే సమయంలో వాణిజ్య ఎగుమతులు తగ్గగా, దిగుమతులు పెరిగాయి. గత ఏడాది (2023) నవంబర్ నెలతో పోలిస్తే ఎగుమతులు 4.85 శాతం క్షీణించాయి. గత ఏడాది నవంబర్ నెలలో ఎగుమతులు 33.75 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది నవంబర్ నెలలో 32.11 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాది నవంబర్ నెలలో దిగుమతులు 55.06 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ నవంబర్ నెలలో 27 శాతం పెరిగి 69.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం కారణంగా వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31 బిలియన్ డాలర్లకు చేరుకోగా... దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.