manchu manoj: జనసేనలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్
- పొలిటికల్ ఎంట్రీపై ప్రస్తుతానికి ఏమీ మాట్లాడనన్న మనోజ్
- మొదటిసారి తన కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డ తీసుకొచ్చామని వెల్లడి
- ఆదరించిన గ్రామస్తులు, అభిమానులకు థాంక్స్ చెప్పిన మనోజ్
కుటుంబ వివాదాల కారణంగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరిగింది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని, జనసేన పార్టీలో వారు చేరబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. సోమవారం ఆళ్లగడ్డ వచ్చిన ఆయన దీనిపై మీడియాతో మాట్లాడారు. పొలిటికల్ ఎంట్రీపై మీడియా మనోజ్‌ను ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని అన్నారు.
ఈ రోజు తన అత్తగారి జయంతి అని, అందుకోసమే మొదటిసారి తన కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డ తీసుకొచ్చామని తెలిపారు. జయంతి రోజు తీసుకొద్దామనే ఇన్నాళ్లూ ఇక్కడకు తీసుకురాలేదన్నారు. తమ కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారని అందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పారు.