Hardik Pandya: ఈ ఏడాది నెటిజ‌న్లు అత్య‌ధికంగా సెర్చ్ చేసిన భార‌త క్రికెట‌ర్ ఎవ‌రంటే..!

Indias Most Searched Cricketer Of 2024 is Hardik Pandya

  • ఈఏడాది నెటిజ‌న్లు అత్య‌ధికంగా సెర్చ్ చేసిన భార‌త క్రికెట‌ర్‌గా హార్దిక్ పాండ్యా
  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఫైన‌ల్ ఓవ‌ర్ బౌలింగ్, భార్య‌తో విడాకులు, ఎంఐ కెప్టెన్సీ వంటివి ఇందుకు కార‌ణం
  • రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ ప్లేయ‌ర్ శ‌శాంక్ సింగ్

ఐపీఎల్ 2024కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్‌గా వైదొలగడంతో మ‌హేంద్ర సింగ్ ధోనీ ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచాడు. 2024లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజ‌యం కార‌ణంగా స్టార్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా బాగానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. రోహిత్ కెప్టెన్‌గా భారత్‌ టైటిల్ సాధించగా, విరాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు లభించింది. అలాగే ఈ ఇద్దరూ టైటిల్ గెలిచిన తర్వాత అంత‌ర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యారు. ఇలా ఎంఎస్‌డీ, రోహిత్‌, కోహ్లీ గ‌తేడాది బాగానే వార్త‌ల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యారు.

కానీ, ఆశ్చర్యకరంగా ఈ ముగ్గురు ఆటగాళ్లను వెన‌క్కి నెట్టి ఈ ఏడాది ఇంట‌ర్నెట్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేసిన భార‌త క్రికెట‌ర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఆఖరి ఓవర్ బౌలింగ్ వేయ‌డం, భార్య‌తో విడాకులు, రోహిత్ స్థానంలో ముంబ‌యి ఇండియ‌న్స్ కెప్టెన్‌గా బాధ్య‌తలు చేప‌ట్ట‌డం, టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో హార్దిక్ ఈ ఏడాది నెటిజ‌న్లు అత్యధికంగా వెతికిన భారత క్రికెటర్‌గా నిలిచిన‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు అతను రోహిత్ స్థానంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ నిర్ణయం అభిమానులకు అంతగా నచ్చలేదు. దాంతో అభిమానులు హార్దిక్‌ను సొంత మైదానం వాంఖ‌డే స్టేడియంలో కూడా తీవ్రంగా ట్రోల్ చేయ‌డంతో చర్చనీయాంశం అయ్యాడు. 

ఇక టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్ తర్వాత హార్దిక్ టీమిండియా టీ2I కెప్టెన్‌గా మారడం ఖాయంగా కనిపించింది. కానీ, అనూహ్యంగా ఆ బాధ్య‌త‌లు సూర్యకుమార్ యాదవ్‌కు ద‌క్కాయి. ఈ స్టార్ ఆల్ రౌండర్ క‌నీసం వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపిక కాలేదు. అలాగే ప్ర‌పంచ‌క‌ప్‌ ముగిసిన కొన్ని వారాల తర్వాత అతను తన భార్య న‌టాషా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. 

ఇలా ప‌లు అంశాల కార‌ణంగా అభిమానులు ఏడాది పొడవునా హార్దిక్ గురించి మాట్లాడుకున్నారు. దాంతో ఈ ఏడాది ఇంటర్నెట్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేసిన భార‌త క్రికెట‌ర్‌గా హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, ఐపీఎల్‌-2024లో పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున అద్భుతంగా రాణించిన శ‌శాంక్ సింగ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక‌ ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ను మెగా వేలానికి ముందు పంజాబ్‌ రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.

  • Loading...

More Telugu News