Atlee: కపిల్ శర్మ అవమానకర వ్యాఖ్యలు.. డైరెక్టర్ అట్లీ స్ట్రాంగ్ కౌంటర్!
- బేబీ జాన్ ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న డైరెక్టర్ అట్లీ
- ఈ సందర్భంగా దర్శకుడి లుక్‌పై కపిల్ జాత్యహంకార వ్యాఖ్యలు
- మనిషి రూపాన్ని బట్టి కాకుండా, మనసును బట్టి అంచనా వేయాలన్న దర్శకుడు
- అట్లీ కౌంటర్‌కి కపిల్ శర్మ నవ్వుతు కవర్ చేసుకున్న వైనం
- నెట్టింట కపిల్ శర్మపై సర్వత్రా విమర్శలు
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ పాల్గొన్నారు. తాను నిర్మించిన బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోహీరోయిన్లు వరుణ్ ధావన్, కిర్తీ సురేశ్‌లతో కలిసి అట్లీ ఈ కామెడీ షోకు వెళ్లారు. ఈ సినిమా విజయ్‌తో అట్లీ తీసిన 'తెరీ'కి రిమేక్. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ ఆయనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా అవమానకరంగా మాట్లాడారాయన.
అట్లీని ఉద్దేశించి మీరెప్పుడైనా ఒక స్టార్ హీరోను మొదటిసారి కలిసినప్పుడు, అట్లీ ఎక్కడా అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారా? అని పరోక్షంగా ఆయన రంగు గురించి ప్రస్తావించారు. దీంతో కపిల్ శర్మకు దిమ్మతిరిగేలా అట్లీ సమాధానం ఇచ్చారు. మొదట తాను కలిసిన స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ అని చెప్పి, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అట్లీ. దానికి కారణం తన తొలి సినిమా రాజారాణికి నిర్మాత మురగదాస్ కావడమే.
తొలిసారి ఆయనను కలిసి కథ వినిపించినప్పుడు ఆయన తన రూపు, రంగు చూడలేదని అట్లీ అన్నారు. కేవలం తాను కథ చెప్పిన విధానం, దానిపై తనకు ఉన్న నమ్మకాన్ని మాత్రమే ఆయన చూశారని తెలిపారు. అలా మనిషి రూపాన్ని బట్టి కాకుండా, మనసును బట్టి అంచనా వేయాలని అట్లీ హోస్ట్ కపిల్ శర్మకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అది విన్న కపిల్ నవ్వుతూ కవర్ చేసుకున్నారు.
ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో కపిల్ శర్మపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షోకి పిలిచి ఇలా అవమానించడం ఏంటని? ఆయన తీరు పట్ల పలువురు మండిపడుతున్నారు. కామెడీ పేరుతో మనిషి వ్యక్తిత్వాన్ని, రూపురేఖలను కించపరచడం తగదని హితవు పలుకుతున్నారు.