Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో చుక్కెదురు
- హష్ మనీ కేసును కొట్టేయలేమన్న జడ్జి
- ఇప్పటికే దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు
- శిక్షను నిరవధికంగా వాయిదా వేసిన వైనం
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా తేల్చగా.. ఈ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. అధ్యక్షులకు కేవలం అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లోనే రక్షణ ఉంటుంది తప్ప ఇలాంటి కేసుల్లో కాదని స్పష్టం చేసింది. హష్ మనీ కేసును కొట్టేయలేమని జడ్జి జువాన్ మర్చన్ తేల్చిచెప్పారు.
హష్ మనీ కేసులో ట్రంప్ పై విచారణ జరిపిన మన్ హట్టన్ కోర్టు నవంబర్ లో ఆయనను దోషిగా తేల్చింది. పోర్న్ స్టార్ కు డబ్బులు ఇచ్చిన విషయం నిజమేనని నిర్ధారించింది. అయితే, ఈ లోగా ఎన్నికలు జరగడం, ట్రంప్ గెలవడంతో కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ కు శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ క్రమంలోనే క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా అధ్యక్షుడికి రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు తాజాగా ఆయనకు రక్షణ కల్పించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టు ఈ కేసును కొట్టివేయకుంటే శిక్ష అభియోగాలు ఎదుర్కొంటూ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు.
హష్ మనీ కేసు..
డొనాల్డ్ ట్రంప్ గతంలో స్టార్మీ డానియల్స్ అనే పోర్న్ స్టార్ తో సన్నిహితంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో స్టార్మీ డానియల్స్ నోరు విప్పకుండా ఉండేందుకు 1.30 లక్షల డాలర్లను ట్రంప్ ముట్టుజెప్పారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనినే హష్ మనీ అంటున్నారు. ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన విరాళాల సొమ్మును ఇలా దుర్వినియోగం చేశారని, దీనికోసం తప్పుడు రికార్డులు సృష్టించారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు మొత్తం 34 అంశాల్లో ట్రంప్ పై నేరారోపణలు నమోదయ్యాయి.