Mohan Bhagwat: సమాజంలో ప్రతిదీ తప్పుగా జరుగుతోందనే అభిప్రాయం పెరుగుతోంది: మోహన్ భాగవత్
- ప్రతి ఒక్కరూ తమ ఇగోను పక్కన పెట్టాలని లేదంటే అగాధంలో పడిపోతారని హెచ్చరిక
- శాశ్వతమైన ఆనందాన్ని గుర్తిస్తేనే నిస్వార్థమైన సేవ చేయగలుగుతామని వ్యాఖ్య
- సమాజంలో ఒక ప్రతికూల అంశం జరిగితే 40 రెట్లు మంచి జరుగుతోందన్న ఆరెస్సెస్ చీఫ్
సమాజంలో ప్రతిదీ తప్పుగా జరుగుతోందనే అభిప్రాయం పెరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇగోను పక్కన పెట్టాలని లేకపోతే అగాధంలో పడిపోతారన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... శాశ్వతమైన ఆనందాన్ని గుర్తించినప్పుడే నిస్వార్థమైన సేవ చేయగలుగుతారన్నారు. అది ఇతరులకు సహాయపడే ధోరణిని కూడా పెంచుతుందన్నారు.
సమాజంలో ఒక ప్రతికూల అంశం జరిగితే దానికి 40 రెట్లు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కాబట్టి సానుకూల అంశాల గురించి అవగాహన కల్పించడం అవసరమన్నారు. సేవ అనేది సమాజంలో శాశ్వతమైన నమ్మకాన్ని పెంచుతుందన్నారు. అన్ని వర్గాల సాధికారతే దేశం అభివృద్ధిని నిర్ధారిస్తుందన్నారు. దేశ పురోగతికి దోహదపడేలా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
రామకృష్ణ పరమహంస ప్రకారం మనలో రెండు 'నేను'లు ఉంటాయని, ఒకటి ముడి పదార్థమైతే రెండోది పరిపక్వత చెందినది అన్నారు. ముడిపదార్థంగానే ఉంటామంటే అగాధంలో పడిపోతామని హెచ్చరించారు. పరిపక్వతతో ఉండాలని సూచించారు.