Defamation Suit: ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసిన గోవా సీఎం అర్ధాంగి
- గోవా సీఎం భార్యపై ఆరోపణలు చేసిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
- సంజయ్ సింగ్‌పై కోర్టును ఆశ్రయించిన గోవా సీఎం భార్య
- జనవరి 10 లోగా సమాధానం ఇవ్వాలని సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన గోవా కోర్టు
అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌కు గోవా సీఎం భార్య బిగ్ షాక్ ఇచ్చారు. ఆయనపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. గోవా సీఎం అర్ధాంగి పిటిషన్‌పై సంజయ్ సింగ్‌కు గోవా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జనవరి 10 లోగా సమాధానం ఇవ్వాలని ఎంపీని కోర్టు ఆదేశించింది.
గోవాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన కుంభకోణం వ్యవహారంపై ఇటీవల ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. సీఎం భార్య సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. దీంతో ఆమె నార్త్ గోవాలోని బిచోలిమ్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అడ్ హక్ సివిల్ జడ్జి సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు.
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు సంజయ్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని సీఎం ప్రమోద్ సావంత్ భార్య తన న్యాయవాదుల ద్వారా కోర్టును అభ్యర్ధించారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించాలని ఆమె కోరారు.