IND Vs AUS: టీమిండియా డ్రెస్సింగ్ రూం నుంచి ఆకాశ్ దీప్, బుమ్రాకు వెళ్లిన సందేశం ఇదే!
- బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆసీస్ మూడో టెస్టు
- నాలుగో రోజు ఆటలో బౌలర్లు బుమ్రా, ఆకాశ్ దీప్ బ్యాటర్లుగా పోరాడటం హైలైట్
- పదో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఫాలో ఆన్ నుంచి తప్పించిన ద్వయం
- భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవడానికి చేరువయ్యాక ఆకాశ్ షాట్లు ఆడిన వైనం
- ఆ సమయంలో దూకుడు తగ్గించి సింగిల్స్ రాబట్టాలని బుమ్రా, ఆకాశ్‌కు డ్రెస్సింగ్ రూం నుంచి సందేశం
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ బ్యాటర్లుగా పోరాడటం అనేది హైలైట్‌గా నిలిచింది. ఈ ద్వయం పదో వికెట్‌కు ఏకంగా 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే 33 రన్స్ చేయాల్సిన స్థితిలో ఆకాశ్, బుమ్రా ధైర్యంగా క్రీజులో నిలబడి ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ జోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇక ఓపెనర్‌గా వచ్చి 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ కూడా చివరలో ఈ ద్వయం పోరాడిన తీరును మెచ్చుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేయడం బాగుందన్న అతడు.. ఆఖరి వికెట్‌కు బుమ్రా, ఆకాశ్ దీప్ ఓ చిన్న భాగస్వామ్యం నెలకొల్పడం మంచి విషయం అని పేర్కొన్నాడు. అదే తమ జట్టును ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేసిందన్నాడు. చివరి అరగంట ఆట రసవత్తరంగా సాగిందని, ఆ జోడీ చేసిన రన్స్‌తో పాటు ఆసీస్ బౌలర్లను దైర్యంగా ఎదుర్కొన్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. ఈ సందర్భంగా భారత డ్రెస్సింగ్ రూంకి సంబంధించి ఆకాశ్ దీప్, బుమ్రాకు వెళ్లిన సందేశం విషయమై రాహుల్ మాట్లాడాడు.
భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవడానికి చేరువయ్యాక ఆకాశ్ షాట్లు ఆడాడు. దీంతో దూకుడు తగ్గించి సింగిల్స్ రాబట్టాలని బుమ్రాతో పాటు ఆకాశ్ దీప్‌కు డ్రెస్సింగ్ రూం నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ ఓ సందేశం పంపారని రాహుల్ తెలిపాడు. "ఇది చాలా సులభం. ఆ రన్స్ సాధించడానికి ప్రయత్నించండి. అలా అని బౌండరీలకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీరు షాట్లు ఆడతారనే ఉద్దేశంతో ఫీల్డర్లను దూరంగా సెట్ చేశారు. అలాంటప్పుడు సింగిల్స్ తీస్తే సరిపోతుందని డ్రెస్సింగ్ రూం నుంచి సందేశం వెళ్లింది" అని రాహుల్ వివరించాడు.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 260 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 252/9 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 8 పరుగులు జోడించి ఆఖరి వికెట్ కోల్పోయింది. పదో వికెట్‌కు బుమ్రా (10), ఆకాశ్ దీప్ (31) ద్వయం ఏకంగా 47 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. అంతకుముందు ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆతిథ్య జట్టుకు 185 పరుగుల ఆధిక్యం లభించింది.