Akash Deep: ట్రావిస్ హెడ్‌కు సారీ చెప్పిన ఆకాశ్ దీప్.. గబ్బా టెస్టులో ఆసక్తికర సన్నివేశం!
- ఆకాశ్ దీప్ ప్యాడ్స్‌లో ఉండిపోయిన బంతి
- దాన్ని తీసి కిందపడేసిన భారత ప్లేయర్
- ఫీల్డింగ్ చేస్తున్నహెడ్.. బాల్ చేతికి ఇవ్వాలని చెబుతుండగానే కింద పడేసిన ఆకాశ్
- ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని హెడ్‌కు సారీ
బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా ప్లేయర్ ఆకాశ్ దీప్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాల్ అతని కాలుకు కట్టుకున్న ప్యాడ్స్‌లో ఉండిపోయింది. దాంతో అతడు ఆ బాల్‌ను చేతితో తీసి కిందపడేశాడు. కానీ, అప్పటికే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ అతనికి దగ్గరగా వచ్చాడు. బాల్ చేతికి ఇవ్వాలని చెబుతుండగానే ఆకాశ్ కింద పడేశాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని హెడ్‌కు సారీ చెప్పాడు. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, ఈ టెస్టులో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 252/9 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 8 పరుగులు జోడించి ఆఖరి వికెట్ కోల్పోయింది. పదో వికెట్‌కు బుమ్రా (10), ఆకాశ్ దీప్ (31) ద్వయం ఏకంగా 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ 211 పరుగుల లీడ్‌లో ఉంది. క్రీజులో ట్రావిస్ హెడ్ (08), మిచెల్ మార్ష్ (01) ఉండగా.. ఆ జట్టు స్కోర్ 26/3 (9 ఓవర్లు).