AP High Court: హోంగార్డులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట
- పెద్ద ఎత్తున కానిస్టేబుళ్ల నియామకానికి చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం
- కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న ఏపీ హైకోర్టు
- ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితాను తయారు చేయాలని స్పష్టం చేసిన హైకోర్టు
హోంగార్డులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితాను తయారు చేయాలని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. కానిస్టేబుల్ ఎంపికలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హోంగార్డులు కోరారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు శీనాకుమార్, శివరాం, ఆంజనేయులు తదితరులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించని హోంగార్డు అభ్యర్ధులు ప్రస్తుతం పిటిషన్లు దాఖలు చేశారని, ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎంపిక మధ్యలో నిబంధనలను మార్పు చేయడం కుదరదని ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు పూర్తయిన తర్వాత ప్రత్యేక కేటగిరీగా హోంగార్డులను పరిగణించాలని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేస్తూ తుది తీర్పునిచ్చింది.