Rahul Gandhi: పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తలకు గాయం.. రాహుల్ గాంధీ తోసేశాడని ఆరోపణ.. వీడియో ఇదిగో!

BJP Odisha MP Injured In Parliament

  • ఎంపీని ఆసుపత్రికి తరలించిన అంబులెన్స్ సిబ్బంది
  • కాంగ్రెస్ పార్టీ తీరుపై పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీల ఆందోళన
  • లోపలికి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపణ

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా బీజేపీకి చెందిన ఎంపీ ఒకరు గాయపడ్డారు. స్వల్ప తోపులాట జరగడంతో ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కిందపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. రక్తమోడుతున్న ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. వీల్ చైర్ పై అంబులెన్స్ వద్దకు వెళుతున్న సారంగి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఇద్దరమూ కిందపడడంతో తన తలకు గాయమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తోసేయడం వల్లనే తాను కిందపడ్డానని సారంగి చెప్పారు.

కాగా, బుధవారం పార్లమెంట్ లో కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీల తీరుకు నిరసనగా గురువారం బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో ఆందోళన చేశారు. మరోవైపు, అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య పార్లమెంట్ ఆవరణలో స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఒడిశా ఎంపీ సారంగి గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి రాహుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

సభలోకి వెళ్లే హక్కు మాకు ఉంది: రాహుల్
బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఇతర ఎంపీలతో కలిసి తాను సభలోకి వెళుతుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు. తమను సభలోకి వెళ్లనివ్వకుండా బెదిరించారని చెప్పారు. సభలోకి వెళ్లే హక్కు తమకుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు తమను అడ్డుకుని తోసేశారని, ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ కిందపడ్డాడని వివరించారు. వీడియో ఫుటేజీ చూస్తే ఏం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుందని రాహుల్ గాంధీ వివరించారు.

  • Loading...

More Telugu News