Pakistan: పాకిస్థాన్ కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు

US imposes more sanctions over Pakistans missile program

  • దీర్ఘశ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సాయం చేస్తున్నాయంటూ ఫైర్
  • పాక్ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ డీసీ పైనా ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం
  • దురదృష్టకరమంటూ స్పందించిన పాక్ ప్రభుత్వం

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయని, సామూహిక జన హనన ఆయుధాల తయారీకి సాయపడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ డీసీ) కూడా ఉంది. ఇది పాక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది.

ఇది సామూహిక జనహనన ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాక్ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ సహా నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. దీంతో పాటు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 

క్షిపణి ప్రయోగానికి వినియోగించే పరికరాలను ఎన్ డీసీ కొనుగోలు చేస్తోందని, షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని అమెరికా వెల్లడించింది. ఈ పరికరాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను ఎన్ డీసీకి అక్తర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ సరఫరా చేస్తోందని తెలిపింది.

ఎన్ డీసీ తరఫున మిసైల్ లో వినియోగించే పలు పరికరాలను అఫిలియేట్‌ ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ చెప్పారు. కాగా, తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నవని పాక్ ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News