Chandrababu: ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం కోరుకుంటున్నారు: సీఎం చంద్రబాబు
- ముమ్మరంగా టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్
- నేడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్
- 76 లక్షల సభ్యత్వాలతో చరిత్ర సృష్టించామన్న చంద్రబాబు
- డిసెంబరు 30 నాటికి సభ్యత్వాల నమోదు పూర్తి చేయాలని దిశానిర్దేశం
- రూ.100 సభ్యత్వ రుసుముతో రూ.5 లక్షల బీమా ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని వెల్లడి
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై భారీ స్థాయిలో దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ సభ్యత్వ నమోదుపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 76 లక్షల సభ్యత్వాలతో చరిత్ర సృష్టించామని అన్నారు. అందరి భాగస్వామ్యంతోనే ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు సాధ్యమైందని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 76,89,103 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు.
టీడీపీపై నమ్మకం, విశ్వాసంతో సభ్యత్వం తీసుకుంటున్నారని చంద్రబాబు వివరించారు. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందని స్పష్టం చేశారు.
కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా రూ.1.35 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కేవలం రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా అందించే ఏకైక రాజకీయ పార్టీ టీడీపీ అని వెల్లడించారు. 685 మంది పార్టీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్నారని, శాశ్వత సభ్యత్వం ద్వారా వచ్చిన నిధిని కార్యకర్తల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. శాశ్వత సభ్యత్వం తీసుకున్న నియోజకవర్గాల్లో నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ముందుందని చంద్రబాబు వెల్లడించారు.
మంగళగిరిలో 71, గంగాధర నెల్లూరులో 38, పెదకూరపాడులో 37 శాతం సభ్యత్వాల నమోదుతో ముందున్నాయని వివరించారు. డిసెంబరు 30వ తేదీ లోపు సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి త్వరలోనే గుర్తింపు కార్డులు అందిస్తామని చెప్పారు.
పార్టీకి ఎవరూ చెడ్డపేరు తీసుకురావొద్దని, ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.