Mohan Babu: అజ్ఞాతంలో మోహ‌న్ బాబు.. పోలీసుల గాలింపు

Hyderabad Police Hunting for Actor Mohan Babu

  • మీడియా ప్ర‌తినిధిపై దాడి నేప‌థ్యంలో మోహ‌న్ బాబుపై కేసు
  • ఈ దాడి కేసులో ఆయన‌ను విచారించేందుకు ప‌హాడీ ష‌రీఫ్ పోలీసుల‌ ప్ర‌య‌త్నం
  • దాంతో అజ్ఞాతంలోకి మోహ‌న్ బాబు.. దుబాయి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం

మీడియా ప్ర‌తినిధిపై దాడి నేప‌థ్యంలో సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్ బాబుపై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ దాడి కేసులో ఆయ‌న‌ను విచారించేందుకు ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, ఆయ‌న మాత్రం అజ్ఞాతంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో మోహ‌న్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఈ క్ర‌మంలో ఆయ‌న దుబాయి వెళ్లిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు మాత్రం ఆ ప్ర‌చారాల‌ను ఖండించారు. మోహ‌న్ బాబు దుబాయి వెళ్ల‌లేద‌ని, భార‌త్‌లోనే ఉన్నార‌ని చెబుతున్నారు. 

కాగా, మోహ‌న్ బాబు కుటుంబ గొడ‌వ‌ల నేప‌థ్యంలో జ‌ల్‌ప‌ల్లిలోని త‌న నివాసంలో వార్త క‌వ‌రేజ్ కోసం వెళ్లిన ఓ మీడియా ప్ర‌తినిధిపై దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. జ‌ర్న‌లిస్టు నుంచి మైకు లాక్కొని అత‌డిని ముఖంపై కొట్ట‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో మోహ‌న్ బాబు మీడియాకు లిఖిత‌పూర్వకంగా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు.

ఆ త‌ర్వాత ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌ర్న‌లిస్టును మోహ‌న్ బాబు, మంచు విష్ణు ప‌రామ‌ర్శించారు. ఆసుప‌త్రిలో అతనితో పాటు కుటుంబ స‌భ్యుల‌కు కూడా సారీ చెప్పారు. అయితే, జ‌ర్న‌లిస్టుపై దాడి నేప‌థ్యంలో మోహ‌న్ బాబుపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదైంది. 

  • Loading...

More Telugu News