Kapil Dev: అశ్విన్ సంతోషంగా లేడు.. ముఖంలో ఆవేదన కనిపించింది: కపిల్ దేవ్
- అశ్విన్ ఇలా ఆటను వదిలేయడం షాక్ కు గురి చేసిందన్న కపిల్
- అశ్విన్ కు బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలని సూచన
- అశ్విన్ ఒక ఛాంపియన్ అని కితాబు
అంతర్జాతీయ క్రికెట్ కు టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అశ్విన్ ప్రకటనతో క్రికెట్ అభిమానులే కాకుండా, క్రికెట్ దిగ్గజాలు సైతం షాక్ కు గురయ్యారు. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ... భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన అశ్విన్ ఇలా ఆటను వదిలేయడం షాకు కు గురి చేసిందని చెప్పారు. అభిమానులను సైతం నిరాశకు గురి చేసిందని అన్నారు. అశ్విన్ ముఖంలో ఆవేదన కనిపించిందని, ఆయన సంతోషంగా లేడని చెప్పారు. గౌరవప్రదమైన వీడ్కోలుకు ఆయన అర్హుడని... కొన్ని రోజులు వేచి ఉండి, భారత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చని తెలిపారు.
అశ్విన్ కు తగిన గౌరవం ఇవ్వాలని కపిల్ అన్నారు. టీమిండియా మ్యాచ్ విన్నర్ అశ్విన్ కు బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలని చెప్పారు. ప్రయోగాలకు అశ్విన్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడని... అదే ఆయనను గొప్ప క్రికెటర్ గా నిలబెట్టిందని కొనియాడారు. అశ్విన్ ఒక ఛాంపియన్ అని కితాబునిచ్చారు. కెప్టెన్ నమ్మే బౌలర్ అశ్విన్ అని చెప్పారు.