Health: ఇలా చేస్తే చాలు.. శీతాకాలంలో విటమిన్-డీ పుష్కలంగా లభ్యం
- రోజుకు రెండు గుడ్లు తింటే శరీరానికి అందనున్న విటమిన్-డీ
- శీతాకాలంలో ఎముకల నొప్పులకు కూడా చెక్
- జుట్టు రాలడం, చర్మ సమస్యలను కూడా నివారించవచ్చంటున్న వైద్య నిపుణులు
శీతాకాలంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం సహజం. అయితే, ఈ అత్యల్ప ఉష్ణోగ్రతల పరిస్థితులు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. శరీరంలో అంతర్గతంగా అవసరమైన ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, రక్త ప్రసరణ మందగించడం, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, ఆహారంలో చిన్నపాటి మార్పు చేసుకుంటే చాలా సమస్యలను అధిగమించవచ్చు.
చలికాలంలో ప్రతిరోజూ 2 గుడ్లు తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో అధిక ప్రోటీన్లు, ఒమేగా-3తో పాటు కొన్ని విటమిన్లు లభిస్తాయని, ఇవి శీతాకాలంలో వచ్చే అనేక సమస్యలను దూరం చేస్తాయని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా గుడ్ల ద్వారా పుష్కలంగా లభించే విటమిన్-డీ ఎముకలు, మెదడు కణాల పనితీరును మెరుగుపరచడంలో చక్కగా ఉపయోగపడుతుంది.
మనం తినే గుడ్లు శరీరంలో కొలెస్ట్రాల్‌గా మారి నిల్వ అవుతాయి. దాని నుంచి శరీరం విటమిన్-డీని ఉత్పత్తి చేసుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గుదలకు కూడా గుడ్లు బాగా ఉపయోగపడతాయి. అధిక ప్రోటీన్ల కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా తీసుకునే ఆహారం తగ్గుతుందని అంటున్నారు. హార్మోన్ల పనితీరును కూడా సమతుల్యం చేస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గుదలలో గుడ్లు బాగా దోహదపడతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.
గుడ్లలో పుష్కలంగా లభించే విటమిన్-డీ, జింక్ పదార్థాలు ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి, రోజు రెండు గుడ్లు తింటే చలికాలంలో కీళ్ల నొప్పుల వంటి ఎముకల సమస్యలను నివారిస్తుందని చెబుతున్నారు. ఇక, గుడ్లలో లభించే విటమిన్-బీ జట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. చర్మం, గోళ్ల ఆరోగ్యానికి కూడా విటమిన్-బీ ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.