Keshavardhini: కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు
- ఆయిల్ పెట్టుకుంటే అలర్జీ వస్తోందని ఫిర్యాదులు
- మేరఠ్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అమ్మకాలు
- నూనె అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ మేరఠ్ లో ఆయిల్ అమ్ముతున్న ముగ్గురు యువకులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఓ బట్టతల వ్యక్తి కూడా ఉండడం గమనార్హం. స్వయంగా ఆయిల్ అమ్ముతున్న వ్యక్తి అదే ఆయిల్ తో తన బట్టతలపై జుట్టు పెంచుకోలేక పోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మేరఠ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ప్రహ్లాద్ నగర్ లో ముగ్గురు యువకులు కేశవర్ధిని నూనె అమ్మకాలు జరుపుతున్నారు. జుట్టు ఒత్తుగా పెరుగుతుందని, బట్టతల మాయమైపోతుందని చెబుతూ లిసాడీ గేటు ప్రాంతంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేసి ప్రవేశరుసుం రూ.20, కేశవర్ధిని నూనె ధర రూ.300లకు అమ్ముతున్నారు.
బట్టతలపై మళ్లీ వెంట్రుకలు మొలిపిస్తామని ప్రచారం చేయడంతో జనం పోటెత్తారు. రద్దీ కారణంగా చుట్టుపక్కల వీధుల్లో ట్రాఫిక్ జాం అయింది. ఈ నూనె కొని వాడిన వారు నెత్తిపై దురద, అలర్జీల బారిన పడ్డారు. షాదాబ్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. సదరు కేశవర్ధిని నూనె అమ్ముతున్న ఇమ్రాన్, సల్మాన్, సమీర్ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. విచారణలో ఇలాంటి ప్రత్యేక శిబిరాలు ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా నిర్వహించినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.