Offbeat: మానసిక ప్రశాంతత కోసం కోటి రూపాయల జీతాన్ని పూచికపుల్లలా వదిలేసుకున్నాడు!
- బెంగళూరు టెకీ సంచలన నిర్ణయం
- దశాబ్ద కాలంపాటు సాగిన సుదీర్ఘ కెరియర్‌కు బ్రేక్
- భార్యతో చర్చించి ఇంటి లెక్కలు తయారుచేసుకున్న వరుణ్
- జీతం లేకుండా ఉన్న డబ్బుతో ఎలా గడపవచ్చే ప్లాన్ తయారీ
- భార్య కూడా అండగా నిలవడంతో ఉద్యోగానికి బ్రేక్
- ‘ఎక్స్’లో పోస్టు చేయడంతో వైరల్
- అంత జీతం వదులుకుని ఏం సాధించావన్న ప్రశ్నకు మనశ్శాంతి, ప్రశాంతత, సంతోషం అని జవాబు
- తమలాంటి వారికి మార్గం చూపావంటూ ఎంతోమంది ప్రశంసలు
ఇది ఉరుకుల పరుగుల జీవితం. పరుగు ఆపామంటే మనల్ని ఓవర్ టేక్ చేసి వెళ్లిపోతారనే భయం. ఆ చిన్న భయమే మనల్ని తీరికలేకుండా జెట్ స్పీడుతో పరుగులు పెట్టిస్తోంది. సుఖం లేదు, సంతోషం లేదు.. వ్యక్తిగత జీవితంపై శ్రద్ధలేదు, ఆరోగ్యంపై అశ్రద్ధ.. మొత్తంగా మనపై మనకు పట్టింపులేకుండా పోతోంది. అనవసర టెన్షన్లతో ఆపసోపాలు పడుతూ జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడం తప్ప మరేంలేదు. అలాగని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపడితే.. అమ్మో! ఇంకేమైనా ఉందా? ఇంటి అద్దె, పిల్లల చదువు, ఖర్చులు.. ఇవి తలచుకుంటే గుండె గుభేల్‌మంటుంది. అందుకనే.. ఇష్టం ఉన్నా లేకున్నా సమయానికి ఆఫీసులోవాలిపోతుంటారు.
ముంబైకి చెందిన 30 ఏళ్ల వరుణ్ హసీజా మరోలా ఆలోచించాడు. రెండు నెలల క్రితం ఏడాదికి కోటి రూపాయలకు పైగా వేతనాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. జీతం కంటే జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నాడు. టార్గెట్ల వెనక నిత్య పరుగు ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. కోటి రూపాయలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నా అది ఆయనకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. ఇక విసుగెత్తిపోయాడు. లాభం లేదనుకుని ఏడాదిపాటు ఉద్యోగ జీవితానికి విరామం ఇవ్వాలని అనుకున్నాడు. ఏడాదిపాటు రీచార్జ్ అయ్యాక అప్పుడు ఏదైనా సృజనాత్మక వ్యాపారం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు.
విషయాన్ని ఇంగ్లిష్ ప్రొఫెసర్ అయిన భార్య మోక్షద మన్‌చందాతో పంచుకున్నాడు. ఇన్నాళ్లు అనుభవించిన బాధను ఆమెతో పంచుకున్నాడు. ఆమె కూడా అందుకు సరేనంది. డబ్బులు తర్వాత.. ముందు మానసిక ప్రశాంతతే ముఖ్యమని భర్తకు అండగా నిలిచింది.
వివరంగా ఇంటి ఖర్చులు
ఏడాదిపాటు ఉద్యోగం చేయకుండా, నెలకు వచ్చే దాదాపు రూ. 8 లక్షల వేతనాన్ని వదులుకుంటే గడిచేదెలా? అన్న ఆలోచన వరణ్, మోక్షద దంపతులకు వచ్చింది. దీంతో వెంటనే ఖర్చులన్నీ వివరంగా రాసుకున్నారు. మూడు నెలలకు సంబంధించి ఎక్సెల్ షీట్ తయారుచేశాడు. అనవసర ఖర్చులను జాబితా నుంచి తొలగించారు. అయితే, సేవింగ్స్‌ను మాత్రం వదిలిపెట్టలేదు. ఏడాది పాటు ఒక్కరి జీతంతో ఎలా గడపవచ్చో మొత్తం ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఉద్యోగం వదిలేసినప్పుడు చేతికి వచ్చే మొత్తంతో ఆరు నెలలపాటు హాయిగా జీవించొచ్చని అనుకున్నారు. లెక్కలన్నీ వేశాక ఆ సొమ్ముతో ఏడాదిపాటు ఢోకాలేదనుకున్నారు. గతంలో ఖర్చులు.. వాటిలో వదిలించుకోవాల్సినవి ఇలా.. అన్నీ వివరంగా రాసుకున్నారు.
రెండు వారాల క్రితం ఆ వివరాలను ‘ఎక్స్’ లో పెట్టడంతో వైరల్ అయింది. రెండు నెలల క్రితం తాను అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. ‘నో ప్లాన్.. నో బ్యాకప్.. దశాబ్దంపాటు కొనసాగిన కెరియర్ నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా’ అంటూ ఆ వివరాలను షేర్ చేశాడు. అది చూసిన వారు వరుణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. లేఆఫ్‌లతో రోడ్డున పడుతున్న ఎంతోమందికి దారి చూపించావని కొనియాడుతున్నారు. అంత పెద్ద జీతాన్ని వదిలేసుకుని ఏం సాధించావ్ మిత్రమా? అన్న విమర్శలకు.. మనశ్శాంతి, ప్రశాంతత, సంతోషం, కుటుంబంతో గడపడానికి నాణ్యమైన సమయం అని బదులిచ్చి వారి నోళ్లు మూయించాడు వరుణ్.