HYDRA: 'హైడ్రా' కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
- ప్రజాగ్రహంతో కూల్చివేతలపై 'హైడ్రా' వెనక్కి తగ్గిందని వార్తలు
- వాటిపై తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్పందించిన రంగనాథ్
- కూల్చివేతలపై హైడ్రా ఎలాంటి యూటర్న్ తీసుకోలేదని స్పష్టీకరణ
హైదరాబాద్ మహానగరంలో కూల్చివేతలపై 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాగ్రహంతో కూల్చివేతల విషయంలో హైడ్రా వెనక్కి తగ్గిందని వస్తున్న వార్తలపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై 'హైడ్రా' ఎలాంటి యూటర్న్ తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీ ప్రకారమే తమ సంస్థ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. 2024 జులైకి ముందు అనుమతులు ఉన్న ఇళ్లను కూల్చబోమని మరోసారి ఆయన ధ్రువీకరించారు.
ఒకవేళ ప్రభుత్వం అన్ని ఇళ్లను కూల్చదలుచుకుంటే లక్షలాది ఇళ్లను తాము కూల్చాల్సి ఉంటుందన్నారు. ఇక ఏ విషయంలోనైనా అనుభవాల నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిందేనని రంగనాథ్ పేర్కొన్నారు. అందుకే 'హైడ్రా' ఏర్పాటైన తర్వాత అనుభవాలతో కొన్ని విధానాలను మార్చుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.