Ravindra Jadeja: 5 నిమిషాల ముందు చెప్పాడు.. అశ్విన్ రిటైర్మెంట్‌తో నిజంగా షాకయ్యా: రవీంద్ర జడేజా
- ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా చెప్పిన దిగ్గజ స్పిన్నర్
- షాకింగ్ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అశ్విన్
- అశ్విన్ రిటైర్మెంట్‌పై మెల్‌బోర్న్‌లో విలేకరులతో మాట్లాడిన జడేజా
- ఆ రోజంతా తామిద్దరం కలిసే కూర్చున్నా.. కనీసం ఆ సూచన కూడా చేయలేదని వ్యాఖ్య
- అశ్విన్ ఆలోచనాశైలి ఇలాగే ఊహాతీతంగా ఉంటుందని చమత్కరించిన జడ్డూ
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా చెప్పి అందిరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలో అతడు ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే విషయమై తాజాగా తోటి స్పిన్నర్ రవీంద్ర జడేజా మాట్లాడుతూ అశ్విన్ రిటైర్మెంట్ తనకు నిజంగా షాకిచ్చిందన్నాడు. ఆ రోజంతా తామిద్దరం కలిసే కూర్చున్నామని, కానీ రిటైరయ్యే ఐదు నిమిషాల ముందు తనతో ఆ విషయం చెప్పినట్లు జడ్డూ పేర్కొన్నాడు.
మెల్‌బోర్న్‌లో జడేజా విలేకరులతో మాట్లాడుతూ.. "ఆ రోజంతా ఇద్దరం కలిసే కూర్చున్నాం. కానీ రిటైరయ్యే 5 నిమిషాల ముందు, అంటే ప్రెస్ మీట్ ముందు నాకు అశ్విన్ విషయం చెప్పాడు. చాలా షాకయ్యా. అతని ఆలోచనాశైలి అలాగే ఊహాతీతంగా ఉంటుంది. ఇది జరగబోతోందని ఎవరో నాకు చెప్పారు. కానీ, నేను నమ్మలేదు. నా ఆన్-ఫీల్డ్ మెంటార్ లాగా ఉండేవాడు. ఇకపై అతణ్ని చాలా మిస్ అవుతాను.
మేము బౌలింగ్ భాగస్వాములుగా చాలా ఏళ్లుగా కలిసి ఆడాం. మ్యాచ్ పరిస్థితికి సంబంధించి మేము మైదానంలో ఒకరికొకరు తరచూ సందేశాలు పంపించుకునే వాళ్లం. ఇప్పుడు నేను ఈ విషయాలన్నింటినీ కోల్పోతాను. రెడ్‌బాల్ క్రికెట్‌లో భారత్ తరఫున అశ్విన్ చాలా కీలక పాత్ర పోషించాడు.
అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు యువ క్రికెటర్లకు ఇది మంచి అవకాశం. అశ్విన్ స్థానం భర్తీ చేసే ప్రస్తుత ప్లేయర్లలో వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ చాయిస్ అనేది నా అభిప్రాయం. భారత జట్టు త్వరలోనే మెరుగైన ఆల్‌రౌండర్, బౌలర్‌ని పొందుతుందని ఆశిస్తున్నాను" అని జడేజా చెప్పుకొచ్చాడు.
ఇక రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 106 మ్యాచులు ఆడాడు. 37సార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. మొత్తంగా 537 వికెట్లు తీశాడు. అలాగే 3,503 పరుగులు చేశాడు. అశ్విన్ భారత జట్టు తరఫున ఎంతంటి కీరోల్ పోషించాడనేది ఈ గణాంకాలే చెబుతాయి.