Revanth Reddy: అల్లు అర్జున్ ను ఎందుకు ఓదార్చుతున్నారు?: సినీ ప్రముఖులపై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy fires on Tollywood stars

  • సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కారణమన్న రేవంత్
  • కోమాలో ఉన్న చిన్నారిని ఒక్క సినీ ప్రముఖుడు కూడా పరామర్శించలేదని మండిపాటు
  • సినీ నటుడిని అరెస్ట్ చేస్తే రాద్ధాంతం ఎందుకని ప్రశ్న

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. థియేటర్ వద్దకు హీరో, హీరోయిన్లు రావద్దని చెప్పినప్పటికీ లెక్క చేయకుండా అల్లు అర్జున్ వచ్చారని తెలిపారు. ఆ సందర్భంగా తొక్కిసలాట చేసుకుని మహిళ మృతి చెందిందని... ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో కోరారు. ఈ క్రమంలో రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో సంధ్య థియేటర్ గురించి మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదని... ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉందని... అందువల్ల ఎక్కువగా మాట్లాడటం సరికాదని... దర్యాప్తు అధికారి ఇబ్బంది పడే అవకాశం ఉందని రేవంత్ చెప్పారు. 

సంధ్య థియేటర్ వద్దకు రావద్దని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ వచ్చారని తెలిపారు. ఎక్స్ రోడ్ ముందు నుంచే రోడ్ షో చేసుకుంటూ కారు రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ వచ్చారని... ఆ సమయంలో అభిమానులు వేల సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో రేవతి చనిపోయారని, ఆమె కుమారుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అల్లు అర్జున్ ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని రేవంత్ చెప్పారు. 20 రోజులుగా ఆసుపత్రిలో చిన్నారి కోమాలో ఉంటే ఇంత వరకు ఒక్క సినీ ప్రముఖుడు కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేదని రేవంత్ విమర్శించారు. అల్లు అర్జున్ కు కన్ను పోయిందా? కాలు పోయిందా? ఎందుకు అందరూ ఆయన దగ్గరకు వెళ్లి ఓదారుస్తున్నారని మండిపడ్డారు. ఒక సినీ నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News