Harish Rao: అప్పు మీద చర్చించడానికి ఇప్పటికీ నేను రెడీ: హరీశ్ రావు సవాల్
- గత ప్రభుత్వం రూ.6.40 లక్షల కోట్లు అప్పు చేసిందన్న రేవంత్ రెడ్డి
- సీఎం గోబెల్స్ ను మించిపోయారన్న హరీశ్ రావు
- తాము చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లే అని స్పష్టీకరణ
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ.6.40 లక్షల కోట్ల అప్పులు చేశారని ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం తెలిసిందే. అప్పులు చేసి కూడా ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని... కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని అంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే మేం అప్పులు చేయాల్సి వస్తోందని బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి గోబెల్స్ ను మించిపోయాడని అన్నారు.
"కాంగ్రెస్ మంత్రులు ఒక్కరూ సరైన మాట మాట్లాడరు... జూపల్లి రూ.8 లక్షల కోట్లు అంటాడు, ముఖ్యమంత్రేమో రూ.6 లక్షల కోట్లు అంటాడు... ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రేమో ఒకరోజు రూ.7.11 లక్షల కోట్లు అంటారు, మరుసటిరోజు అసెంబ్లీకి వచ్చి రూ.6.70 లక్షల కోట్లు అంటారు... అసలు కథ ఏంటంటే... ఆ అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే.
ఇదే మాట నిన్న నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. అప్పు ఉన్నది రూ.4.17 లక్షల కోట్లే... ఇది తప్పు అయితే, ఎలా తప్పో చెప్పండి అని నిలదీస్తే... డిప్యూటీ సీఎం నోరు విప్పకుండా తలదించుకుని సభ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అప్పు మీద చర్చించడానికి నేను రెడీ" అంటూ కాంగ్రెస్ సర్కారుకు సవాల్ విసిరారు.