young india skill university: తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో 4 కొత్త కోర్సులు
- ఇప్పటికే రెండు కోర్సులను నిర్వహిస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ
- మరో నాలుగు కోర్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన స్కిల్ యూనివర్శిటీ
- ఆసక్తిగల అభ్యర్ధులు ఆయా కోర్సులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించిన వర్శిటీ ప్రతినిధులు
తెలంగాణలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ యూనివర్శిటీలో అధికారులు నాలుగు కోర్సులను నిర్వహిస్తుండగా, మార్కెట్లో ప్రాధాన్యం ఉన్న మరో నాలుగు కోర్సులను ప్రారంభించనున్నారు.
ఖాజాగూడలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ప్రాంగణంలోనే ఉన్న భవనాల్లో స్కిల్ వర్శిటీ తాత్కాలికంగా కొనసాగిస్తుండగా, ఇప్పటికే లాజిస్టిక్స్, ఈ కామర్స్‌లో కోర్సులను ప్రారంభించారు. రెండో విడతలో భాగంగా మరికొన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. సప్లై చైన్ ఎసెన్షియల్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ కోర్సులకు నవతా లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.
బ్యాంకింగ్ – ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి ఉపయోగపడే విధంగా కోర్సును ప్రారంభించనున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫార్మా టెక్నీషియన్ ప్రొగ్రామ్‌తో పాటు లెన్స్‌కార్ట్ స్టోర్ అసోసియేషన్ కోర్సును కూడా ప్రారంభించనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్శిటీ ప్రతినిధులు తెలిపారు.