Narendra Modi: అశ్విన్ రిటైర్మెంట్‌పై హృదయాన్ని హత్తుకునే లేఖ రాసిన ప్రధాని మోదీ

PM Modi Writes Emotional Letter To R Ashwin

  • అశ్విన్ రిటైర్మెంట్ ‘క్యారమ్ బాల్‌‘ను తలపించిందన్న మోదీ
  • ఆట కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారంటూ ప్రశంసలు
  • క్రికెట్‌కు సేవలు అందించేందుకు మరో మార్గాన్ని కనుగొనాలని విజ్ఞప్తి
  • అత్యుత్తమ కెరియర్‌కు అభినందనలు తెలుపుతున్నానంటూ ప్రధాని మోదీ లేఖ

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తు రిటైర్మెంట్ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు షాకయ్యారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ ఈ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్ టెస్టు ముగిసిన వెంటనే అశ్విన్ చేసిన ఈ ప్రకటన అభిమానులనే కాదు.. టీమ్మేట్లను కూడా షాక్‌కు గురిచేసింది. అశ్విన్ రిటైర్మెంట్‌పై తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ మేరకు హృదయాన్ని హత్తుకునే ఓ లేఖను షేర్ చేశారు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన ‘క్యారమ్ బాల్‌’ను తలపించిందని అన్నారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు అత్యధిక వికెట్లు అందించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడని ప్రశంసించారు. 

మోదీ లేఖ ఇలా

‘‘ఈ లేఖ మీకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుందని ఆశిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మీ రిటైర్మెంట్ ప్రకటన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆశ్చర్యపరిచింది. మరెన్నో ఆఫ్‌బ్రేక్‌ల కోసం ఎదురుచూస్తున్న వేళ క్యారమ్ బాల్ విసిరి అందరినీ బౌల్డ్ చేశారు. అయితే, ఇది కఠిన నిర్ణయమేనని అభిమానులు అర్థం చేసుకున్నారు. జట్టును ఎప్పుడూ ఓ మెట్టు పైనే ఉంచిన మీ కెరియర్‌కు దయచేసి నా హృదయపూర్వక అభినందనలు అంగీకరించండి. 

మీ రిటైర్మెంట్‌తో జెర్సీ నంబర్ 99 చాలా మిస్ అవుతుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి మీరు తీసిన 765 వికెట్లలో దేనికదే ప్రత్యేకం. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను కలిగి ఉండటం జట్టు విజయంపై మీ ప్రభావాన్ని చూపుతోంది. టెస్టుల్లో అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టారు. 2011 వన్డే ప్రపంచకప్‌లో విజేత జట్టులో భాగమయ్యారు. అన్ని ఫార్మాట్లలో సీనియర్‌గా కీలక పాత్ర పోషించారు. ఒక మ్యాచ్‌లో సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీయడం ద్వారా మీ ఆల్‌రౌండర్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 

మీ తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా మీ సమయాన్ని జట్టు కోసం వెచ్చించారు. చెన్నైలో వరదల సమయంలోనూ కుటుంబ సభ్యులతో కాకుండా జట్టుతోనే ఉన్నారు. మీరు ఎంతో ఇష్టపడే గేమ్‌కు సహకారం అందించేందుకు మార్గాలను కనుగొనండి. మీ అత్యుత్తమ కెరియర్‌కు మరోమారు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు’’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News