iPhone In Hundi: ఆలయ హుండీలో పొరపాటున ఐఫోన్ వేసిన భక్తుడు.. అది ఇక దేవుడి ఆస్తేనన్న ఆలయ అధికారులు
- తమిళనాడు తిరుపోరూర్‌లోని శ్రీ కందస్వామి ఆలయంలో ఘటన
- హుండీలో వేసినవి దేవుడి సొంతమేనన్న అధికారులు
- ఫోన్ వెనక్కి ఇవ్వడం కుదరదని, కావాలంటే అందులోని డేటాను వెనక్కి తీసుకోవచ్చని స్పష్టీకరణ
- పరిహారం ఇచ్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తామన్న మంత్రి
దేవుడి హుండీలో ఓ భక్తుడు పొరపాటున తన ఐఫోన్ వేసేశాడు. జరిగిన పొరపాటును గ్రహించి ఫోన్‌ను తనకు తిరిగి ఇవ్వాలని అధికారులను వేడుకోగా, అలా ఇవ్వడం కుదరదని, అదిప్పుడు ఆలయ ఆస్తిగా మారిందని అధికారులు సమాధానం ఇవ్వడంతో కంగుతిన్నాడు. తమిళనాడులో జరిగిందీ ఘటన.
1975 నాటి సేఫ్‌గార్డింగ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ హుండీ రూల్స్ ప్రకారం భక్తులు హుండీలో సమర్పించేవన్నీ ఆలయానికే చెందుతాయని, వాటిని తిరిగి యజమానులకు ఇవ్వడం కుదరదని తమిళనాడు హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ విభాగం అధికారులు తెలిపారు. అయితే, ఐఫోన్ యజమానికి ఫోన్‌లోని తన డేటాను తిరిగి తీసుకునేందుకు మాత్రం అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు.
హుండీలో ఐఫోన్‌ను జారవిడిచిన భక్తుడి పేరు దినేశ్. చెంగల్పట్టు జిల్లాలోని తిరుపోరూర్‌లోని శ్రీ కందస్వామి ఆలయంలో కానుకలతోపాటు పొరపాటున ఐఫోన్‌ను వేసేశాడు. పొరపాటును గుర్తించిన వెంటనే ఆలయ అధికారులను కలిసి ఐఫోన్ కోసం విజ్ఞప్తి చేయగా వారు దానిని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించారు. ఎండోమెంట్ మంత్రి పీకే శేఖర్ బాబు కూడా ఇదే విషయం చెప్పారు. హుండీలో భక్తులు సమర్పించినవన్నీ దేవుడి ఖాతాలోకే వెళ్తాయన్నారు. అయితే, ఈ విషయంలో ఫోన్ పోగొట్టుకున్న భక్తుడికి నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉందేమో అధికారులతో మాట్లాడతానని చెప్పారు.