Techie: రోజుకు 15 గంటలు పని.. స్టార్టప్ కంపెనీలో కష్టాలు చెప్పుకుంటూ ఏడ్చేసిన టెకీ
- సరైన శిక్షణ ఇవ్వలేదని, సందేహాలు అడిగితే టీమ్ లీడర్ తిట్టాడని ఆవేదన
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోస్ట్
- మద్దతుగా కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
‘రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేయాల్సి వస్తోంది.. అయినా, కష్టపడుతున్నా. శిక్షణ ఇవ్వకపోవడంతో పని విషయంలో పలు సందేహాలు వస్తున్నాయి. టీమ్ లీడర్ ను అడిగితే గైడెన్స్ ఇవ్వకపోగా తిడుతున్నాడు. తట్టుకోలేక గూగుల్ మీట్ లో టీమ్ లీడర్ ముందు ఏడ్చేశా..’ అంటూ ఓ టెకీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో పోస్ట్ పెట్టాడు. స్టార్టప్ కంపెనీలో తాను ఎదుర్కొంటున్న కష్టాలను చెబుతూ ఆ టెకీ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నీ తప్పేమీ లేదంటూ టెకీకి మద్దతుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రోజుల తరబడి ధైర్యంగా పనిచేసి ఒక్కసారిగా బరస్ట్ అయ్యారని, మిమ్మల్ని మీరు నిందించుకోవద్దని చెబుతున్నారు. జీతం కన్నా ఆత్మగౌరవం ముఖ్యమని, మరో కంపెనీకి మారాలని సూచిస్తున్నారు.
స్టార్టప్ కంపెనీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెబుతూ.. భారతదేశంలోని ఓ స్టార్టప్ కంపెనీలో తాను పనిచేస్తున్నానని, తనను జాబ్ లోకి తీసుకున్నాక సరైన శిక్షణ ఇవ్వలేదని అన్నాడు. రోజూ దాదాపుగా 15 గంటల పాటు పనిచేయాల్సి వస్తోందన్నాడు. అయితే, స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకులలో ఒకరు టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్నారని, ఆయన అందరిముందూ తనను అవమానించాడని చెప్పాడు.
పని విషయంలో ఎదుర్కొంటున్న సందేహాలను తీర్చుకోవడానికి తాను ప్రయత్నిస్తే గైడ్ చేయాల్సిన వ్యక్తి ఇలా అవమానించడం తట్టుకోలేక పోయానని వివరించాడు. గూగుల్ మీట్ లోనే ఏడ్చేశానని, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియడంలేదని చెప్పాడు. మీటింగ్ పూర్తయిన తర్వాత తాను లీవ్ తీసుకుంటున్నట్లు చెప్పానని ఆ టెకీ వివరించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు, వెంటనే ఆ కంపెనీకి గుడ్ బై చెప్పి మరో ఉద్యోగం చూసుకోవాలని సూచించారు.