Pushpa 2: అనూహ్యంగా మళ్లీ ఊపందుకున్న పుష్ప-2 కలెక్షన్లు
- శనివారం దేశవ్యాప్తంగా రూ.25 కోట్ల వసూళ్లు
- దేశవ్యాప్తంగా రూ.1029.9 కోట్లకు చేరిన కలెక్షన్లు
- ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైమాటే
- ఆదివారం మరింత పెరిగే అవకాశం
- బాహుబలి-2 రికార్డు బ్రేక్ చేసేందుకు చేరువలో అల్లు అర్జున్
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్లో ఈ సినిమా అప్రతిహతంగా దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. విడుదలైన 17వ రోజైన శనివారం (డిసెంబర్ 21) ఈ మూవీ కలెక్షన్లలో అనూహ్యంగా భారీ పెరుగుదల కనిపించింది. శుక్రవారం రూ.14 కోట్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా శనివారం ఏకంగా రూ.25 కోట్లు కొల్లగొట్టింది.
దీంతో దేశవ్యాప్తంగా సినిమా కలెక్షన్లు రూ.1029.9 కోట్లకు పెరిగాయి. ఒక్క హిందీ వెర్షన్లోనే రూ.652.9 కోట్లు రాబట్టింది. తెలుగు వెర్షన్లో రూ.302.35 కోట్లు వసూలు చేసిందని సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్నిల్క్’ రిపోర్ట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.1500 కోట్లు దాటిన విషయం తెలిసిందే.
ఇవాళ (ఆదివారం) పుష్ప-2 కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.1040 కోట్ల వసూళ్లతో దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా బాహుబలి-2 టాప్ లో ఉండగా... పుష్ప-2 ఇప్పటికే రూ.1029.9 కోట్లు రాబట్టింది. దీంతో ఆదివారం వసూళ్లు ఆశాజనకంగా ఉంటే ప్రభాస్ రికార్డును అల్లు అర్జున్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇక క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు హాలిడే సీజన్ కావడంతో పుష్ప రాజ్ మరిన్ని వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.