Balmoor Venkat: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మండిపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- తెలుగువాడి సత్తా చాటడమంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా? అని ప్రశ్న
- ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పశ్చాత్తాపం ప్రకటిస్తారని అనుకున్నామని వెల్లడి
- సినిమా హాల్ లో ఎంతసేపు ఉన్నారనేది తేల్చే ఫుటేజ్ ఉందన్న ఎమ్మెల్సీ
తెలుగువాడి సత్తా చాటడమంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా అంటూ అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రంగా మండిపడ్డారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలిసి పశ్చాత్తాపం ప్రకటిస్తారని అనుకున్నామని చెప్పారు. అయితే, హీరో తీరు మాత్రం సరిగాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎవరు తప్పు చేసినా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు.
దీనిపై ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం అల్లు అర్జున్ కు ఏమొచ్చిందని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తప్పుబట్టారు. సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటుచేసుకున్న విషాదం తర్వాత హీరో ఎంతసేపు ఉన్నాడు, లోపల ఆయన ఉన్న ఫుటేజీ, థియేటర్ నుంచి ఎలా బయటకు వెళ్లాడనే దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయని చెప్పారు.
రేవతి మరణించిన మరుసటి రోజు అల్లు అర్జున్ ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఎమ్మెల్సీ చెప్పారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని బల్మూరి వెంకట్ సూచించారు. రేవతి మృతికి సానుభూతి ప్రకటించి, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని హితవు పలికారు.