Bandi Sanjay: అల్లు అర్జున్ కు బండి సంజయ్ సపోర్ట్
- అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం
- రేవంత్ సినీ పరిశ్రమపై పగబట్టినట్టుందని వ్యాఖ్యలు
- ఎంఐఎంతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపణ
సంధ్య థియేటర్ వ్యవహారంలో రాజకీయ నేతలు కూడా రెండు పక్షాలుగా విడిపోయారు. అధికార కాంగ్రెస్ ఒకవైపు, విపక్షాలు మరోవైపు నిలిచాయి. తాజాగా, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ హీరో అల్లు అర్జున్ కు మద్దతు పలికారు.
అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే... రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై పగబట్టినట్టుగా ఉందని అన్నారు. పక్కా ప్లాన్ తో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందనిని వ్యాఖ్యానించారు.
"తొక్కిసలాట ఘటనలో సమస్య ముగిసిన తర్వాత నిన్న ఎంఐఎం సభ్యుడితో అసెంబ్లీలో ప్రశ్న అడిగించుకున్నారు. ఆ ప్రశ్నకు సమాధానమిస్తున్నట్టుగా... ఓ సినిమా స్థాయిలో కథ అల్లి మరీ, మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గుచేటు. ఎంఐఎం ఒక ఐరన్ లెగ్ పార్టీ... గతంలో ఆ పార్టీ బీఆర్ఎస్ తో అంటకాగి, ఆ పార్టీని నిండా ముంచింది. అలాంటి పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పట్టడం ఖాయం" అని బండి సంజయ్ స్పష్టం చేశారు.