Kishan Reddy: అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనకున్నది కాంగ్రెస్ పార్టీయేనా?: కిషన్ రెడ్డి
- హైదరాబాదులో అల్లు అర్జున్ నివాసంపై దాడి
- రాళ్లు విసిరి, పూలకుండీలు ధ్వంసం చేసిన విద్యార్థి జేఏసీ నేతలు
- కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి ఇదే నిదర్శనమన్న కిషన్ రెడ్డి
హైదరాబాదులో అల్లు అర్జున్ నివాసంపై విద్యార్థి సంఘాల నేతలు రాళ్ల దాడికి పాల్పడడం పట్ల కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతిభద్రతలు దిగ్భ్రాంతికర రీతిలో క్షీణించాయన్న వాస్తవాన్ని ఎత్తిచూపుతోందని పేర్కొన్నారు. పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడంలోనూ, వారికి రక్షణ కల్పించడంలోనూ పాలకుల అసమర్థత ప్రతిఫలిస్తోందని విమర్శించారు.
నటులను, చిత్రపరిశ్రమను టార్గెట్ చేయడం అనేది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కనిపిస్తున్న ప్రమాదకర ధోరణి అని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనకున్నది కాంగ్రెస్ పార్టీయేనా? ఇది కాంగ్రెస్ ప్రోత్సాహంతో జరిగిన దాడేనా? అని సందేహం వెలిబుచ్చారు. ఈ మేరకు దాడి వీడియోను కూడా కిషన్ రెడ్డి పంచుకున్నారు.