DK Aruna: అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన డీకే అరుణ.. సీఎం రేవంత్‌పై ఆరోపణలు

DK Aruna condemns the attack on Allu Arjuns house on Sunday

  • రాళ్ల దాడి ఘటన అమానవీయమని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఉన్న వైరాన్ని సినిమా వాళ్లపై చూపడం మంచి పద్ధతి కాదని మండిపాటు
  • సినిమా ఇండస్ట్రీని సీఎం రేవంత్ టార్గెట్ చేయడం సరికాదంటూ డీకే అరుణ ఖండన 

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని బీజేపీ నేత డీకే అరుణ ఖండించారు. సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి అమానవీయమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె అన్నారు.
 
కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని డీకే అరుణ ఆరోపించారు. పోలీసు‌ ఉన్నతాధికారులు ఇలాంటి‌ ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ దాడి‌ వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నట్లు అనుమానం‌ కలుగుతోందని ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘మీకు (రేవంత్ రెడ్డి), కేటీఆర్‌కు ఉన్న రాజకీయ వైరాన్ని సినిమా వాళ్లపై చూపడం మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సరికాదు’’ అని డీకే అరుణ ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

మరోవైపు, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించారు. ఈ ఘటనకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

కాగా, అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు రాళ్లు విసిరారు. ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొన్ని పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరిపైనా కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం అల్లు అర్జున్ ఇంటి వెలుపల పోలీసులు భద్రతను పెంచారు.

  • Loading...

More Telugu News