KL Rahul: సచిన్, కోహ్లీ కూడా సాధించని అరుదైన రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్

KL Rahul has a fine opportunity to achieve a rare milestone during 4th Test
  • నాలుగో టెస్టులో శతకం సాధిస్తే రాహుల్ పేరిట సరికొత్త రికార్డు
  • బాక్సింగ్ డే టెస్టుల్లో హ్యాట్రిక్ సెంచరీలు నెలకొల్పిన ఆటగాడిగా నిలిచే ఛాన్స్
  • 2021, 2023లలో దక్షిణాఫ్రికాపై సెంచరీలు సాధించిన స్టార్ బ్యాటర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ(మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ) వేదికగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 26 నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తవ్వగా ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగవ టెస్ట్‌ను గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. 

కాగా, ఎంసీజీ వేదికగా జరగనున్న బాక్సింగ్‌ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రాణించి సెంచరీ సాధిస్తే తాను ఆడిన బాక్సింగ్‌ డే టెస్టుల్లో హ్యాట్రిక్ శతకాలు సాధించిన ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ చరిత్రలో నిలిచిపోనున్నాడు. 2021, 2023లో దక్షిణాఫ్రికాపై బాక్సింగ్ డే టెస్టుల్లో రాహుల్ సెంచరీలు సాధించాడు. 2021లో సెంచూరియన్‌లో  123 పరుగులు, 2023లో కూడా ఇదే వేదికలో జరిగిన టెస్టులో 101 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ ఇదివరకు 2014లో కూడా బాక్సింగ్ డే టెస్ట్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 1 పరుగు మాత్రమే చేశాడు.

ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 47 సగటుతో మొత్తం 235 పరుగులు సాధించాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 84 పరుగులుగా ఉంది. ఇక, ఈ ఏడాది కేఎల్ రాహుల్ మొత్తం 8 టెస్టులు ఆడాడు. 39.08 సగటుతో 469 పరుగులు సాధించాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ వున్నాయి. 
KL Rahul
Sports News
Cricket
India Vs Australia

More Telugu News