USA: ట్రంప్ టీమ్ లోకి మరో భారత సంతతి వ్యక్తి
- వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్ గా శ్రీరామ్ క్రిష్ణన్
- కృత్రిమ మేధ విషయంలో ట్రంప్ సర్కారుకు సలహాలు ఇవ్వనున్న ఇండియన్ టెకీ
- గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్ బుక్ లలో పనిచేసిన క్రిష్ణన్
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో ఇండియన్ అమెరికన్ కు చోటు దక్కింది. కృత్రిమ మేధకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, టెకీ, రచయిత శ్రీరామ్ కృష్ణన్ ను ట్రంప్ నియమించారు. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృష్ణన్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియమించినట్లు తెలిపారు. వైట్‌హౌస్ ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ ఒ శాక్స్‌తో కలిసి ఆయన పనిచేస్తారని అన్నారు.
కృత్రిమ మేధతో అమెరికన్ నాయకత్వాన్ని మరింత ముందుకుతీసుకెళ్తారని ట్రంప్ వెల్లడించారు. విండోస్ అజుర్ వ్యవస్థాపక సభ్యుడిగా శ్రీరామ్ కృష్ణన్ మైక్రోసాఫ్ట్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేశారని ట్రంప్ తెలిపారు. కాగా, దీనిపై ట్రంప్ కు శ్రీరామ్ కృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామ్ కృష్ణన్ చెన్నైకి చెందిన వారు. చెన్నైలోనే పుట్టిపెరిగిన కృష్ణన్.. అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికా వెళ్లారు. మైక్రోసాఫ్ట్ లో 2007 లో తన కెరీర్ ప్రారంభించి, ఫేస్‌బుక్, యాహూ, ట్విటర్, స్నాప్ తదితర సంస్థలలో పనిచేశారు.