Kidnap: ఏడేళ్ల బాలిక కిడ్నాప్.. ఐదు గంటల్లోనే రక్షించిన బెంగాల్ పోలీసులు

 Bengal Police rescued kidnapped girl in less than 5 hours

  • ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు
  • డబ్బుల కోసం డిమాండ్.. పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాలిక తండ్రికి హెచ్చరిక
  • నిందితుల లొకేషన్ గుర్తించి చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులు
  • నాలుగున్నర గంటల్లోనే ఆపరేషన్ పూర్తి

ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులకు నాలుగున్నర గంటల్లోనే పోలీసులు బేడీలు వేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో జరిగిందీ ఘటన. బాలిక నిన్న ఇంటి ముందు ఆడుకుంటుండగా ఉదయం 11.40 గంటల సమయంలో రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. 

ఆ తర్వాత వ్యాపారవేత్త అయిన బాలిక తండ్రికి ఫోన్ చేసిన దుండగులు డబ్బులు డిమాండ్ చేశారు. విషయాన్ని పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. టెక్నికల్‌గా దర్యాప్తు ప్రారంభించి కిడ్నాపర్ల లొకేషన్‌ను గుర్తించారు. పశ్చిమ బెంగాల్-బీహార్ సరిహద్దులో కిడ్నాపర్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు సమీప జిల్లాలు అయిన ఇస్లామ్‌పూర్, రాయ్‌గంజ్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత నిందితుల ఫోన్ లొకేషన్‌ను సరిగ్గా గుర్తించారు.  

అనంతరం గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి వారి ఆట కట్టించారు. కిడ్నాపర్లను హరీశ్‌చంద్రాపూర్‌కు చెందిన ఇజాజ్ అహ్మద్, రాజు ముస్తఫాగా గుర్తించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేసి, బాలికను రక్షించారు. నిందితుల నుంచి తుపాకి, లైవ్ కార్ట్‌రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాప తండ్రి నుంచి డబ్బులు అందుకున్నాక ఇతాహార్, కరణ్‌దిఘి, దాల్‌ఖోలా మీదుగా బీహార్ పారిపోయేందుకు ప్లాన్ చేసినట్టు ఇంటరాగేషన్‌లో నిందితులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News