Kolkata: ఆ గదిలో జరగలేదు.. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో సంచలన నివేదిక
- మృతదేహాన్ని గుర్తించిన సెమినార్ రూమ్‌లో అత్యాచారం, హత్య జరిగినట్టుగా ఆధారాలు దొరకలేదన్న సీఎఫ్ఎస్ఎల్ నివేదిక
- ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిన ఆధారాలు లేవని వెల్లడి
- ఇటీవలే సీబీఐకి నివేదిక అందించిన సీఎఫ్ఎస్ఎల్
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం కేసులో నమ్మశక్యంకాని విషయాలు వెలుగుచూశాయి. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన నాలుగవ అంతస్తులోని సెమినార్ రూమ్‌లో అత్యాచారం, హత్య జరిగినట్టుగా ఆధారాలు దొరకలేదని సీఎఫ్‌ఎస్ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ లేబోరేటరీ) నివేదిక వెల్లడించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. నేరం జరిగిన ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చునని సందేహాలు వ్యక్తం చేసింది.
సెమినార్ గదిలోని నీలి రంగు పరుపుపై వైద్యురాలు, దాడికి పాల్పడ్డ వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ లేదా దాడి జరిగినట్లు ఆధారాలు కనిపించలేదని నివేదిక విశ్లేషించింది. రూమ్ లోపల మరెక్కడా ఆనవాళ్లు లేవని పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ సీబీఐకి సీఎఫ్ఎస్ఎల్ ఇటీవలే నివేదికను సమర్పించింది.
కాగా, ఈ ఏడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం తొలుత విచారణ చేపట్టింది. ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది.