'90's A Middle Class Biopic: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన తెలుగు సిరీస్ ఇదే!
- ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన '90's
- ఈ ఏడాది జనవరి 5 నుంచి స్ట్రీమింగ్
- ఆసక్తికరమైన కథాకథనాలతో సాగే సిరీస్
- సమపాళ్లలో కలిసిన వినోదం - సందేశం
- అత్యధిక వ్యూస్ ను రాబట్టిన సిరీస్ గా పేరు
ఈ ఏడాదిలో తెలుగు వెబ్ సిరీస్ లు గట్టిగానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయా జోనర్లలో రూపొందిన తెలుగు సిరీస్ లలో మంచి కంటెంట్ కలిగిన వాటిని ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. తెలుగులో ఈ ఏడాది అత్యధిక వ్యూస్ ను రాబట్టిన సిరీస్ లలో, ముందుగా '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' కనిపిస్తూ ఉండటం విశేషం. ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఈ సిరీస్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళీ తనూజ్, ప్రశాంత్, రోహన్, స్నేహల్వ, సంతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ విశేషమైన ఆదరణను దక్కించుకుంది. 1990లలోని పరిస్థితులను కళ్లకు కట్టిన సిరీస్ ఇది. ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసే కథానాయకుడు... అతని భార్యా పిల్లలు... వాళ్లను ప్రభావితం చేసిన మరికొన్ని పాత్రలతో ఈ కథ నడుస్తుంది. దర్శకుడు ఆదిత్య హాసన్ ఆయా పాత్రలను మలచిన తీరు ప్రశంసలను తెచ్చిపెట్టింది.
తల్లిదండ్రులు... పిల్లలు... చదువులు... టీనేజ్ స్నేహాలు... ఆకర్షణలు... ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను నడిపించిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. చక్కని వినోదానికి సందేశాన్ని కలిపి అందించిన తీరు మెప్పించింది. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం మంచి మార్కులు కొట్టేసింది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమై, ప్రతి ఇంటికి చేరువైన సిరీస్ గా ఇది నిలిచింది. ఈ ఏడాదిలో విశేషమైన ఆదరణను పొందిన సిరీస్ గా తన ప్రత్యేకతను చాటుకుంది.