Dil Raju: అల్లు అర్జున్‌ను... ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: దిల్ రాజు

Dil Raju says will meet Allu Arjun and Revanth Reddy
  • సినిమా పెద్దలను కూడా కలుస్తానన్న దిల్ రాజు
  • సీఎంను మరోసారి కలిసి ఇండస్ట్రీ అభిప్రాయం చెబుతానని వెల్లడి
  • ప్రభుత్వానికి, పరిశ్రమకు వారధిలా పని చేస్తానన్న దిల్ రాజు
  • రేవతి భర్తకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని హామీ
తాను అల్లు అర్జున్‌ను కలుస్తానని, అలాగే చిత్ర పరిశ్రమ పెద్దలను కూడా కలుస్తానని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆ తర్వాత సీఎంను కలిసి చిత్ర పరిశ్రమ అభిప్రాయం చెబుతానని తెలిపారు. ఈరోజు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి తనను ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించారని, అమెరికాలో ఉన్నందున ఇన్ని రోజులు ఆయనను కలవలేకపోయానన్నారు. అమెరికా నుంచి రాగానే సీఎంను కలిసినట్లు చెప్పారు. 

అల్లు అర్జున్ సహా సినిమా పెద్దలను కలుస్తానని... అనంతరం పరిశ్రమ అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డికి చెబుతానన్నారు. ఇందుకోసం రేపు లేదా ఎల్లుండి సీఎంను మరోసారి కలుస్తానన్నారు. తాను ప్రభుత్వాన్ని, సినీ పరిశ్రమను సమన్వయం చేస్తానన్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనను ఎవరైనా కావాలని చేస్తారా? రేవతి కుటుంబం వినోదం కోసం సినిమాకు వెళితే ప్రమాదవశాత్తు ఇలా జరిగిందని ఆవేదన చెందారు. రేవతి భర్త భాస్కర్‌కు శాశ్వత ఉపాధిని కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సినిమా పరిశ్రమలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం మాత్రమే అన్నారు. చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో సీఎంను కలిసి అన్ని విషయాలపై చర్చిస్తామన్నారు. ఎలాంటి సమస్య రాకుండా చూసే బాధ్యత తనదే అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వేగంగా రికవరీ అవుతున్నాడని తెలిపారు.
Dil Raju
Revanth Reddy
Allu Arjun
Telangana
Tollywood

More Telugu News