TTD: టీటీడీ ధర్మకర్తల మండలి పలు ముఖ్యమైన నిర్ణయాలు ఇవే...!

TTD board important decisions

  • దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆమోదం
  • స్విమ్స్‌కు జాతీయ హోదా కోసం సిఫార్స్ చేయాలని విజ్ఞప్తి
  • ఫీడ్ బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఏర్పాటు చేయాలని నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్‌పాన్షన్ కోసం అవసరమైన సూచనల కొరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది.

స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదాకోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ విజ్ఞప్తి చేసింది.

కాలినడక దారిలో వచ్చే భక్తుల కోసం మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది.

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ఫీడ్ బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని మండలి నిర్ణయించింది.

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్స్ జారీలో నూతన విధానం అమలుకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అన్నప్రసాద విభాగంలో నాణ్యమైన ప్రసాదం అందించేందుకు ఎస్ఎల్ఎస్ఎంపీసీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 258 మందిని తీసుకోవడానికి ఆమోదం తెలిపింది.

కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న పాఠశాలకు ఎస్వీ విద్యా విధాన ట్రస్ట్ నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది.

భక్తుల ఆరోగ్యం దృష్ట్యా టీటీడీలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ ను ఎస్ఎల్ఎస్ఎంపీసీ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది.

శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం అల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో రూ.3.36 కోట్లతో 6 టాయిలెట్ బ్లాక్స్ లు నిర్మించాలని నిర్ణయించింది.

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.

ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థానిక సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20 కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించమని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News