TTD: పరకామణిలో 100 కోట్ల కుంభకోణం.. టీటీడీ సభ్యుడి సంచలన ఆరోపణలు
- విదేశీ కరెన్సీని దొంగిలించారంటూ టీటీడీ చైర్మన్ కు వినతి
- విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోలేదని విమర్శ
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, హుండీల లెక్కింపు చేపట్టే పరకామణిలో భారీ కుంభకోణం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుండీ నగదు లెక్కింపు సమయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారని చెప్పారు. ఇందుకోసం ఆపరేషన్ చేయించుకుని పొట్టలో రహస్య అర ఏర్పాటు చేయించుకున్నారని అన్నారు. ఇలా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి శ్రీవారి సొమ్ము రూ.100 కోట్లు కొల్లగొట్టారని టీటీడీ చైర్మన్ కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెద్ద జీయర్ తరఫున పరకామణిలో సి.వి.రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని భానుప్రకాశ్ రెడ్డి చెప్పారు. కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా రూ. 100 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని తన పొట్టలోని రహస్య అరలో దాచి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. 2023 ఏప్రిల్ 29న హుండీ నగదు తరలిస్తూ రవికుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడన్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, అయితే, లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకున్నారని చెప్పారు. ఈ కేసు విషయంలో నాటి టీటీడీ చైర్మన్, కొంతమంది అధికారులు, పోలీసులు రవికుమార్ ను బెదిరించి వంద కోట్ల ఆస్తులు రాయించుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని టీటీడీ చైర్మన్ ను కోరారు.