Manjummel Boys: మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు ఈ సినిమావే!
- 9 కోట్లతో నిర్మితమైన 'ప్రేమలు'
- 136 కోట్ల వసూళ్లతో ఆశ్చర్య పరిచిన ప్రేమకథ
- 20 కోట్లతో రూపొందిన 'మంజుమ్మెల్ బాయ్స్'
- 240 కోట్ల వసూళ్లతో చేసిన అద్భుతం
- 100 కోట్లు దాటిన మరికొన్ని సినిమాలు
మలయాళం ఇండస్ట్రీ మేకర్స్ కథాకథనాలపై ఎక్కువ ఫోకస్ పెడతారు. ఖర్చు తక్కువ కాన్సెప్టులను ఎంచుకుంటారు. ఖర్చు తక్కువే అయినా వారు తయారు చేసుకునే కంటెంట్ బలంగా ఉంటుంది .. ఆ కంటెంట్ లో కొత్తదనం ఉంటుంది. అందువల్లనే వారి సినిమాలు భారీ వసూళ్లను రాబడుతూ ఉంటాయి. బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉంటాయి. అలా ఈ ఏడాది కూడా మలయాళ సినిమాలు వసూళ్ల పరంగా విన్యాసాలు చేశాయి.
ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలలో, 100 కోట్లకి పైగా కొల్లగొట్టినవి వరుస బెట్టి కనిపిస్తాయి. ఆ జాబితాలో బడ్జెట్ ను పోల్చి చూసుకుంటే 'మంజుమ్మెల్ బాయ్స్' .. 'ప్రేమలు' మొదటి రెండు స్థానాలలో కనిపిస్తాయి. మిగతా వాటిలో పృథ్వీ రాజ్ సుకుమారన్ 'ఆడుజీవితం' .. ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' .. టోవినో థామస్ 'ARM' కనిపిస్తాయి. వసూళ్ల విషయంలో 'భ్రమయుగం' ఒక మెట్టు క్రింద కనిపించినప్పటికీ, ఈ ఏడాదిలో జరిగిన గొప్ప ప్రయోగంగా .. ప్రయత్నంగా నిలిచింది.
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమా, 240 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఊపిరి బిగబట్టి చూసే ఈ కంటెంట్, భాషతో సంబంధం లేకుండా కనెక్ట్ అయింది. ఇక 'ప్రేమలు' సినిమా కోసం ఖర్చు చేసింది 9 కోట్లు మాత్రమే. కానీ ఈ సినిమా 136 కోట్లను తెచ్చిపెట్టింది. ఇలా ఈ సారి మలయాళం ఇండస్ట్రీ మరిచిపోలేని హిట్లు తన ఖాతాలో వేసుకుందనే చెప్పాలి.