Virat Kohli: పేలవ ఫామ్‌పై రవిశాస్త్రి ప్రశ్న.. విరాట్ కోహ్లీ సమాధానం!
- అంచనాలపై తాను దృష్టిపెడితే జట్టుకు అవసరమైన ప్రదర్శన చేయలేమన్న విరాట్
- సొంత గేమ్ ప్లాన్ ప్రకారం ఆడతానని వెల్లడి
- బాక్సింగ్ డే టెస్టులో సమష్టిగా ఆడతామని వ్యాఖ్య
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. పెర్త్ టెస్టులో అజేయ సెంచరీ మినహాయిస్తే ఈ సిరీస్‌లోని మిగతా ఇన్నింగ్స్‌లలో 7, 11, 3 మాత్రమే పరుగులు చేశాడు. అంచనాలు అందుకోలేకపోతుండడంపై దిగ్గజ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రశ్నించగా విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
గత రెండు మూడు ఇన్నింగ్స్‌లో తాను ఆశించిన విధంగా ఆడలేదని, టెస్టు క్రికెట్లో ఎదురయ్యే సవాలు ఇదేనని చెప్పాడు. అంచనాలపై దృష్టి పెట్టడం మొదలుపెడితే ఆడాల్సిన ఆటకు దూరమవుతామని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘‘ కాబట్టి, నేను నా వద్ద ఉన్న గేమ్ ప్లాన్ ప్రకారం ఆడతాను. నా విధానంలో ఆట పరిస్థితిని అర్థం చేసుకొని చాలా క్రమశిక్షణతో ఆడాలి. చాలా ఏళ్లుగా నన్ను విజయవంతం చేసింది ఈ విధానమే. జట్టుకు నా నుంచి ఏం అవసరమో దానిపైనే నేను దృష్టి పెడతాను’’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
‘‘నేను ముందుగానే ఔట్ అయితే పరిస్థితి వేరుగా ఉంటుంది. చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పితే జట్టుకు ఉపయోగకరంగా మారుతుంది. కాబట్టి, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకొని సొంత గేమ్ ప్లాన్ రూపొందించుకోవాలని నేను భావిస్తున్నాను’’ అని విరాట్ వివరించాడు.
ఆస్ట్రేలియాలో తన మునుపటి పర్యటనలతో పోలిస్తే ప్రస్తుతం పిచ్‌లు సజీవంగా మారాయని, విభిన్న పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆటలో వేరే విధానాన్ని అనుసరించాలని కోహ్లీ చెప్పాడు. బ్యాటర్లు వీలైనన్ని ఎక్కువ బంతులు ఎదుర్కోవాలని చెప్పాడు. ఇక, బాక్సింగ్ డే టెస్ట్‌లో జట్టుగా రాణించబోతున్నామని విరాట్ తెలిపాడు.