Revanth Reddy: తొక్కిసలాట ఘటన... సినీ ప్రముఖుల ముందే సీఎం రేవంత్ ఆవేదన
- ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
- తొక్కిసలాట ఘటన తాలూకు వీడియో చూసి ముఖ్యమంత్రి ఆవేదన
- మహిళ ప్రాణాలు కోల్పోవడంతోనే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నట్లు వెల్లడి
- తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై సమావేశంలో చర్చ
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందారు. ఈ ఘటనపై తాజాగా సినీ ప్రముఖులతో జరుగుతున్న భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో ఈ ఘటన తాలూకు వీడియోను అధికారులు ప్లే చేసి చూపించారు. దాంతో ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది. మహిళ ప్రాణాలు కోల్పోవడంతోనే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని సూచించారు. సినీ ఇండస్ట్రీకి తప్పకుండా సామాజిక బాధ్యత ఉండాలని సీఎం తెలిపారు. శాంతిభద్రతలు, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవని సినీ ప్రముఖుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.