Revanth Reddy: సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుంది... సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- ఈ సమావేశంపై 'ఎక్స్' వేదికగా సీఎం స్పెషల్ పోస్ట్
- సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో... పరిశ్రమలో తీసుకోవాల్సిన పలు చర్యలపై ముఖ్యమంత్రి సినీ పెద్దలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 'ఎక్స్' (ట్విట్టర్ వేదికగా) ఒక పోస్టు పెట్టారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు సీఎం ట్వీట్ చేశారు.