Dil Raju: సీఎం మీటింగ్ లో జరగనివి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారు: దిల్ రాజు

Dil Raju condemns fake news on meeting with CM Revanth Reddy
  • నేడు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం
  • బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఇక కుదరని రేవంత్ అన్నట్టు వార్తలు
  • పోలీసులు తొక్కిసలాట వీడియోలు వేసి చూపించినట్టు కథనాలు
  • ఈ కథనాలను ఖండించిన దిల్ రాజు
  • సీఎంతో సమావేశంలో ఎక్కడా నెగెటివిటీ లేదని స్పష్టీకరణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల సమావేశంపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాల పట్ల ప్రముఖ నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంతో భేటీ అయిన తరువాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మీటింగ్ లో అసలు జరగనివి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారని దిల్ రాజు మండిపడ్డారు. 

సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగిందని, 0.5 పర్సెంట్ కూడా నెగిటివిటీ లేదని స్పష్టం చేశారు. ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని వివరించారు. 

"ఇవాళ్టి సమావేశంలో  బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్ల గురించి అసలు టాపిక్కే రాలేదు. పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియోలు మాకు ప్రదర్శించలేదు. బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు. ప్రతిదీ జవాబుదారీతనంతో ఉండాలి అని డీజీపీ సూచించారు. 

హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ కు ఐటీ, ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమ కూడా అంతే కీలకంగా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని చెప్పారు. అలాగే, గద్దర్ అవార్డుల కార్యక్రమం FDC తో అనుసంధానంగా జరగాలి అని చెప్పారు. 

సీఎం గారు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు కోసం తన సలహాలు, సూచనలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మేము ఆయనిచ్చిన సలహాలు,సూచనలపై దృష్టి పెడతాం. తదుపరి సమావేశంలో వివరణాత్మక ప్రతిపాదనను ఆయన ముందు ఉంచతాం" అని అన్నారు.
Dil Raju
Revanth Reddy
Tollywood
Fake News
Hyderabad
Telangana

More Telugu News