Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
- తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్ సింగ్
- ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స
- పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఇవాళ రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయన... పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ వయసు 92 సంవత్సరాలు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన మన్మోహన్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలను నడిపించారు. 13వ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్... దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుపొందారు. దేశంలో అనేక ఆర్థిక సంస్థరణల రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1982-85 మధ్య కాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా వ్యవహరించారు.
ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్... 1998-2004 మధ్య రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు.
1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. అనేక సంస్కరణలతో (ఎల్.పి.జి) దేశ పురోగతికి బాటలు పరిచారు. 1993, 94లో ఉత్తమ ఆర్థికమంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు. 2010లో ఆయనను వరల్డ్ స్టేట్స్ మన్ అవార్డు వరించింది. మన్మోహన్ యూజీసీ చైర్మన్ గానూ వ్యవహరించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్ కు స్థానం లభించడం విశేషం. తన సుదీర్ఘమైన కెరీర్లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గానూ సేవలు అందించారు. ఆయనకు 1987లో పద్మవిభూషణ్ ప్రదానం చేశారు. 2017లో ఆయన ఇందిరాగాంధీ బహుమతి అందుకున్నారు.
మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు పాకిస్థాన్ లో 1932 సెప్టెంబరు 26న జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చేసింది. మన్మోహన్ సింగ్ కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు (ఉపీందర్, దమన్, అమృత్ సింగ్) ఉన్నారు.