Manmohan Singh: మన్మోహన్‌సింగ్‌కు నివాళి.. బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్‌లతో బరిలోకి భారత జట్టు
- గత రాత్రి మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్
- ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్ట్
- మన్మోహన్‌కు నివాళిగా నల్ల రిబ్బన్లతో బరిలోకి భారత ఆటగాళ్లు
న్యూఢిల్లీలో మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ గౌరవార్థం ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ వయసు సంబంధిత సమస్యలతో ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ గత రాత్రి ప్రాణాలు విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.
దేశానికి వరుసగా రెండుసార్లు సేవలు అందించిన ఆయనకు నివాళిగా భారత క్రికెటర్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి ఆడతారని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్ 1991 ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. దేశాన్ని దివాలా అంచు నుంచి బయటపడేసి ఆర్థిక సరళీకరణ యుగానికి నాంది పలికారు. ఇది దేశ ఆర్థిక గమనాన్ని మార్చిందని విశ్వసిస్తారు.