Manmohan Singh: రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. ఈరోజు అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న కేంద్రం
- నిన్న సాయంత్రం కన్నుమూసిన మన్మోహన్ సింగ్
- ప్రస్తుతం మన్మోహన్ నివాసం వద్ద పార్థివదేహం
- ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
మన దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన మాజీ ప్రధాని మన్హోహన్ సింగ్ అస్తమయం చెందిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆయన కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్ లోని నివాసం వద్ద ఉంచారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.
మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించారు. ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది.
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అప్పటి అవిభక్త భారతదేశంలో (ఇప్పటి పాకిస్థాన్ పంజాబ్)లోని గాహ్ లో జన్మించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందారు. ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ గా, ఎకనామిక్ అడ్వైజర్ గా భారత ప్రభుత్వంలో పని చేశారు. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా పని చేశారు.